ముద్దు గారే యశోద…

ఇవాళ, నేను ఒక కొత్త విషయం కనుక్కున్నా. ఎందుకో పొద్దున్న లేచినప్పటి నుంచీ నా బుర్ర లో “ముద్దు గారే యశోద” పాట తిరుగుతూంది. ఇంక లాభం లేదని online ఎక్కడో వెతికిపట్టి విన్నా. గమనించినది ఏంటంటే ఈ అన్నమాచార్య కీర్తన లో ప్రతీ చరణం లో మూడు రత్నాల చొప్పున నవరత్నాల తో శ్రీ కృష్ణుడిని (శ్రీ వేంకటేశ్వర స్వామిని) పోలుస్తాడు. ఇంతకీ నవరత్నాలు అంటే ఏవి?

1. ముత్యము – pearl
2. మాణిక్యము – ruby
3. వజ్రము – diamond
4. పచ్చపూస – emerald
5. పగడము – coral
6. గోమేధికము – amethyst
7. వైఢూర్యము – opal
8. పుష్యరాగము – topaz
9. ఇంద్రనీలము – sapphire

ఈ english equivalents లొ గోమేధికము, వైఢూర్యము, పుష్యరాగము గురించి అనుమానంగా ఉంది…మిగిలినవి కరెక్టే అనుకుంటా.

Edit: స్వాతిగారి comment మేరకు ఈ కీర్తన పూర్తిగా ఇక్కడ పెడుతున్నా. తప్పులుంటే క్షమార్హుడిని.

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంతనింతా గొల్లేతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంశుని పాలి వజ్రము
కాంతుల మూడులోకాల గరుడ పచ్చపూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు

కాళింగుని తలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్య వజ్రము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు

ప్రకటనలు